Monday, August 3, 2015

ష్ !!  అరవకు!
-----------------------
అసలునిజం నీతో చెప్పేస్తాను
కుడివైపున వున్న వాళ్ళంతా
కుదేలై కూలబడిన వాళ్ళు
స్వాతంత్రసమరంలో స్వార్ధ రహితంగా
పాల్గొన్నా సమరయోధులకివ్వాల్సిన పించను రానివాళ్లు
తమపించను ఎవరికో ఇచ్చేసారని తెలిసి దిగాలుబడి
దిటవు పడని గుండెతో కాలం వెళ్లబుచ్చుతున్న వాళ్ళు!

ఆకళ్ళలోకి తొంగిచూస్తే నయవంచన ఎంత ప్రభావం చూపుతోందో అర్ధమవుతుంది.
వక్ర్రీకరించ బడ్డ వాస్తవానికి వారే అసలు సిసలు ఆనవాళ్ళు.
ఇటు వైపు తలతిప్పి చూడు
వెండి తెరవెలుగులకు ఆకర్షితమై
వేల్పుల్లా వెలుగుదామని  వచ్చిపడిన దీపం పురుగులు,

దర్శకుల వస్రసన్యాసపు కాంక్షలకు లోబడక

పడుచుదనాన్ని పలహారంగా అందివ్వ నిచ్చగించక

ఆ పంచన తలదించుకుని పరువపు పొంగులను దాచుకోలేక
సిగ్గు పడుతూ శీలాన్ని కాపాడుకుంటూ
బొట్టు చెరగకుండా బయటపడిన భామాలలామలు.
ఈదిక్కుకు తలవంచి చూడు
నేతల వాగ్దానాలు నిజమని నమ్మి
ఉద్యోగాలవేటలోపడి తీర్ధప్రసాదాలను సమయానికి సమర్పించుకోలేక

వయసు మీరి అర్హతను కోల్పోయిన ఆశోపహతులైన అదృష్ట హీనులు.
--------------------------------------------
సాదర క్షమాపణలతో
------------------
కుర్చీలన్నీ ఖాళీగా వెక్కిరిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతొ దర్శనమిస్తున్నాయ్
కవిగారి కవితా పఠనం అనుస్యూతంగా సాగుతున్నది
ఎక్కడా ఇక్కడ సాయం సమయాన కవిసమ్మేళనం జరగబోతుందన్న 
ఫ్లెక్షీలేమీ కట్ట బడి న దాఖలాల్లేవు అలాంటి హెచ్చరికలూ కానరావు
అయినా శ్రోతలతీరు మాత్రం మారడంలేదు మారే సూచనలు కనిపించడంలేదు
కవులే ఇకపై తమ తీరు మార్చుకోవాలేమో
నేల విడిచి చేసే సాముగరిడీలకు స్వస్తి చెప్పాలేమో
పదప్రయోగంలోనూ వినూత్న మైన ఒరవడిని అనుసరింవాలేమో
ఇతివృత్త సేకరణలో నూత్న మర్యాదలను పాటించాలేమో 
.
కవిత్వం రాయడమే కాదు అవతలి వారి కవిత్వాన్ని వినడంకూడా అలవరుచుకోక తప్పదు మరి .
ఇస్తే వాయనం పుచ్చుకుంటే వాయనం అన్నట్టు మన తీరు ఇకనైనా మారాలి తప్పదులాగుంది 
కవిసమ్మేళనాలు ఘనంగా మనకు మనమే శ్రద్ధగా జరుపుకోవాలి
ఇసుకవేస్తే రాలిపడడానికయిన కొద్దిపాటి జనం రావాలి
కవితా పతాక ఇకనైనా గుండెలనిండా పండుగై ఎగరాలి.
----------------------------------------------------------------------

No comments:

Post a Comment