Tuesday, August 18, 2015

ఉంగిడి
----------రావెల
=======================
మావూరికి ఉంగిడొచ్చినట్లున్నది
మనిషికీ మనిషికీ మధ్యన
అంతరాయం పెద్దదైపోతున్నది.
అంతరంగ కధనాలు వినే
ఆస్కారమే శూన్యమై నిలుచున్నది.
ఇంటింటికీ పొరపొచ్చాలు
ప్రవాహాల్లా
పొంగిపొరలుతున్నవి.
గుండెగొంతుకలు విప్పి మాట్లాడే
మనసులే కరువవుతున్నాయి.
అత్మీయతానురాగాల
ఊసులే బరువవుతున్నాయి .
అనుబంధాలు పులకరింపజేసే
పలకరింపులూ సకృత్తుగానే
సమీపాన వినిపిస్తున్నాయ్.
రాజకీయం రంగప్రవేశం చేయకముందు
సంతోషం సామ్రాజ్ఞిగా దర్శనమిచ్చేది
ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ దిగుళ్ళ చాపలే
విస్తారంగా పరుచుకుని కళ్ళకు కనబడుతున్నవి.
తాలూ తుప్పరగాళ్ళకే అధికారం
దాసోహమంటున్నది
టాలా టోలీ గాండ్లే
దబాయింపులతో పనులు
చేయించుకోగలుగుతున్నారు.
స్వార్ధం, సంకుచితత్వం
సిం హాసనమెక్కి కులుకుతున్నవి.
నయగారం నయవంచన
న్యాయాన్ని నిలువు దోపిడీకి గురిచేస్తున్నవి.
త్యాగం అన్నపదమే నిఘంటువులోంచి
బహిష్కృతమౌతున్నది.
కళ్ళులేని కబోదిలా న్యాయం
కకావిలకు ప్రాణంపోస్తున్నది.
మావూరికీ ఉంగిడెందుకొచ్చిందో
తెలియక మానవత్వం మరిగిపోతున్నది.
మంచితనం మృగ్యమవకుండా ఆదుకోవాలన్న
సత్యమే నాకవితకు ప్రాణమై ఊపిరులూదుతున్నది.
==============================

No comments:

Post a Comment