Monday, August 3, 2015

మశానగీతం 
--------------------------
మట్టిని మట్టి జేసే
మహాప్రస్థానం మొదలయింది
మనుషులంటూ ఊళ్ళో ఉంటే
మశానానికి తరలిరండి
అనుబంధం ఆత్మీయతా
అమ్మకానికి దొరక్కుండా
సుదూరప్రంతాలకు
తరలిపోయినతీరు గమనించండి

పల్లె బతుకు గుల్లయిపోయింది
మెడలో ఇప్పటిదాకా
మెరిసిన పచ్చ పచ్చని హారం
ముళ్ళపూల దండగామరింది.

పంటపొలాలన్నీ చేపలచెరువులై
సగం మంది ఉపాధినికాజేసింది
ఇప్పుడు ఇండ్లస్థలాలుగా మారి
అందరి పొలం గట్లను మింగేసింది.

కుంటల చిన్ననీటి గరువుల
పోషణ కుంటుపడి పోయింది
చెరువులన్నీ ఇందిరమ్మ గృహాలై
నీటి జాడలను నెమ్మదిగా కాజేసింది.

నేడంతా చరిత్రతిరగబడినట్లయింది
నీటి చాయలు కనరావు
స్వచ్చమైన గాలి
కరువు జాబితాలో జమయింది

అడుగడుగునా
అవరోధాల ప్రతిబంధకాలే
పల్లె ప్రగతికి
శాపకారణాలై నిలిచిపోయాయి

మట్టినినమ్ముకున్న మనుషులు
మనాదికి గురైపోనారు
పంటవిరామం శిలాశాసనమై మిగిలింది
మట్టియే జీవనాధారమైన మనుషులు
మనాదికి గురైపోనారు
పంటవిరామం శిలాశాసనమై మిగిలింది
అందుకే మట్టిని నమ్ముకున్న
మనుషులకు మనుగడే బరువయింది.

మట్టిని శాశ్వతంగా దూరంజేసే
మహత్కార్యం సులువయింది
మట్టిని మట్టి జేసే
మహాప్రస్థానం మొదలయింది

ఊపిరాడుతున్న మనుషులెవరైనా బతికుంటే
మశానానికి తరలిరండి
రాబందులరెక్కల చప్పుడు
చెవులారా వినండి

---------------------------------

No comments:

Post a Comment