Monday, August 3, 2015

తరు శాఖా చంక్రమణం 
-----------------------------------
అదేమిటో ఈచెట్టుమీద
ఎప్పుడూ పక్షులు వాలిన దాఖలాల్లేవు
నాకు ఊహతెలిశాక ఆసందర్భమే కనబడలేదు .
రుతువు ఏదయినా ఆచెట్టు ఆయా సమయ సందర్భాలలో
 సంతసించిన జాడలూ కనరావు.
కొరివి దయ్యాల్లాగా  నేతల వాగ్దానాల
 కవిల కట్టలు ఎప్పుడూ  దాని శిఖరాగ్రాన తిష్టవేసి  
కనుమరగవకుండా కాపలా కాస్తూనే ఉంటాయి
అందుకే ఆతరువెప్పుడూ మౌనాన్నాశ్రయించిన రుషిలా
నిరామయంగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించి
 నివురు గప్పిన నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంటుంది .
వెలుగు చీకట్ల మధ్యన వేదన ననుభవిస్తూనే ఉంటుంది.
సుఖ సంతోషాల సంబరాల పట్ల శూన్య దృష్టితోనే ప్రవర్తిస్తుంది.
నిరాశానిస్పృహల మధ్యన ఇప్పుడు  నిరామయంగా కాలం వెళ్ళ దీస్తున్నది.

------------------------------------------------------------------------------
అనంత సంగ్రామo
గెలుపుగుర్రాల కెందుకో
ఈ గాయాల ప్రస్థానం
అడుగడుగునా
యీ అవరోధాల
ఆటు పోట్ల
కధలూ, గాధా సప్త శతులు?

అపజయం
అందిపుచ్చుకునేతీరు
గమనించు
ఆఖరు క్షణం దాకా
అలుపెరుగని
అనంత సంగ్రామమే సాగిస్తుంది
కిందపడిపోయిన ప్రతిసారీ
ద్విగుణీకృతోత్సాహంతో
ఎగసిపడి మళ్లీ పోరాటపటిమతొ
ఆఖరి అవకాశాన్నికుడా
అందిపుచ్చుకునే వీలుకోసమే
శ్వాసిస్తుంది.

ఎగసిపడే అలల తీరును గమనించు
ఎప్పుడూ చెలియలికట్టను దాటాలనుకునే
ఆలోచనలేవీ
మనసు చెంతకు చేరుకోనివ్వవు
తమపరిధిలో తామే
గిరిగీసుకున్నట్లు ఎగిరెగిరిపడి
భయోత్పాతాన్ని కలిగిస్తూ ఉంటాయి
విజయబావుటాలను ఎగురవెసే వీలుకోసం ఆరాటపడుతుంటాయి
మలయమారుత వీవనలో

పిల్లగాలుల తీరును గమనించు
మనసును తక్షణమే ఆహ్లాదపరిచే సందర్భాన్ని
అందిపుచ్చుకునే వీలుకోసమే
విశేష శ్రమకోరుస్తూ వుంటాయి
హోరుగాలి ఒక్కోసారి
విజృంభిత ధృతిలో
విలయనర్తనం చేయాలని చూసి
మనిషికి తత్తరపాటును కలిగిస్తుంది
అయినా సర్దుమణిగే దిశగానే
అకుంఠిత శ్రమజేస్తుంది
అందరినీ ఆహ్లాదపరచాలనే
ఆరాటపడుతుంది
 రావెల పురుషోత్తమరావు
 9394100531

No comments:

Post a Comment