Monday, August 3, 2015

మేఘ సందేహం
*********************
ఎప్పుడూ ఎందుకలా
ఎగాదిగా ఆకాశం వైపు ఆశగా దృష్టి సారించి
స్థాణువై అలానే నిలుచుండిపోతావ్ ?
మేఘసందేశం విందామనా?
చెవులు రిక్కించి ,మరీ మెడను సారించావు?
వివిధ జీవరాశుల్లో సంభవించే కష్ట సుఖాల్లాగానే
తెలిమబ్బులూ వర్షాభ్రుకాలూ
కలగలుపుగా పెనవేసుకుని
నింగిలో కదలుతూ వుంటాయి
ఆషాఢ మేఘాలు ఆకసాన్ని ఆవరించగానే
పైరుపంటలన్నీ పరవశించిపోతాయ్
చిరుగాలులకు తలలూపే మొక్కలుసైతం
ఆనందబృందావనిలో విహరించినరీతిలో
సంతోష సాగరపు పరవళ్లలో పరవశమై , మునకలేస్తూ వుంటాయ్.
ఉదయాన్నే ప్రభాతగీతాలనాలపించే, భక్తకోటిలాగా మబ్బులు లేలేత బంగరు కిరణ సమ్యుక్తమై నిద్రావస్థలోని ప్రపంచాన్నిమేలుకొలుపుతూ వుంటాయి
సాయం సంధ్య సమీపించగానే
రకరకాల రంగుల్లో
తరుణీలలామలు తీర్చిదిద్దే రంగవల్లుల్లా
తళతళా మెరిసిపోతూ
వడివడిగా పరుగులెడుతూ
క్రీడాస్ఫూర్తితో మెలగుతూ వుంటాయి .
మబ్బులమనసుల్లో యేముందో వెనువెంటనే
తెలుసుకోవాలనే తపన మనల్ను త్వర పెడుతూ వుంటాయి
మబ్బులు మన మనోరధాలను సజావుగా నడిపించే సారధ్యబృందాలు.
మన హృదయాలను నల్లేరుపై బండి నడకలా సాగింపజేయగల
జంటకవుల్లాంటి,  ఘనాపాఠీలు.
ప్రతిభా వ్యుత్పత్తుల ప్రకటనా సామర్ధ్యంగల
సౌజన్యశీలురు సుమా ఈమబ్బులు
అందుకే ఈమబ్బులపరవళ్ళన్నా
ఈ మబ్బుల తడబడని వడి వడి కదలికలన్నా నాకు అపరిమిత ఆనందం

అందుకే వాటి స్థితి-గతుల పై తదేక దృష్టిని సారించి పరశించిపోతుంటాను .

No comments:

Post a Comment