అకుంఠిత శ్రమ
గెలుపుగుర్రాల కెందుకో
ఈ గాయాల ప్రస్థానం
అడుగడుగునా
యీ అవరోధాల
ఆటు పోట్ల
కధలూ, గాధా సప్త శతులు?
అపజయం
అందిపుచ్చుకునేతీరు
గమనించు
ఆఖరు క్షణం దాకా
అలుపెరుగని
అనంత సంగ్రామమే సాగిస్తుంది
కిందపడిపోయిన ప్రతిసారీ
ద్విగుణీకృతోత్సాహంతో
ఎగసిపడి మళ్లీ పోరాటపటిమతొ
ఆఖరి అవకాశాన్ని కూడా
అందిపుచ్చుకునే వీలుకోసమే
శ్వాసిస్తుంది..
ఎగసిపడే అలల తీరును గమనించు
ఎప్పుడూ చెలియలికట్టను దాటాలనుకునే
ఆలోచనలేవీ
మనసు చెంతకు చేరుకోనివ్వవు
తమపరిధిలో తామే
గిరిగీసుకున్నట్లు ఎగిరెగిరిపడి
భయోత్పాతాన్ని కలిగిస్తూ ఉంటాయి
విజయబావుటాలను ఎగురవెసే
వీలుకోసం
అనవరతం ఆతృత
మలయమారుత వీవనలో
పిల్లగాలుల తీరును గమనించు
మనసును తక్షణమే ఆహ్లాదపరిచే సందర్భాన్ని
అందిపుచ్చుకునే వీలుకోసమే
విశేష శ్రమకోరుస్తూ వుంటాయి
హోరుగాలి ఒక్కోసారి
విజృంభిత ధృతిలో
విలయనర్తనం చేయాలని చూసి
మనిషికి తత్తరపాటును కలిగిస్తుంది
అయినా సర్దుమణిగే దిశగానే
అకుంఠిత శ్రమజేస్తుంది
అందరినీ ఆహ్లాదపరచాలనే
ఆరాటపడుతుంది
No comments:
Post a Comment