Monday, August 3, 2015

ఎన్నాళ్ళని?
నేనిప్పుడు జీవితాన్ని
ఆసాంతం అవలోడనం చేస్తూ
ఆమూలాగ్రంగా అధ్యయనం చేస్తున్నాను
అక్షరానుక్రమణంలో
అనుశీలనా దృష్టితో
పరిశీలిస్తున్నాను.
నడచివచ్చిన బాటంతా
నాణ్యమైనదేనని అంగీకరించకపోయినా
నగుబాట్ల పాల్జేసేరీతిగా లేదనిమాత్రం
కరాఖండీగా చెప్పగలను
ఏదిశను చూసినా
 దశమారని జీవితాలు
ఎప్పుడు చెవులు రిక్కించినా
పునరంకితమౌదామన్న
పునరుక్తి సంభాషణలు
చెవిదగ్గరగా హోరుపెడుతూ.
ఆప్యాయతానురాగాలకు
అవధుల్లేనన్ని అడ్డంకులు
ప్రేమాభిమానాలకూ
పొసగని రీతిలో వెలువడే
కీలకమౌ సంకేతాలు.
అన్నీ మనీ చుట్టూ పరిభ్రమిస్తూ
మానవత్వాన్నే
మకిలబరుస్తున్న దాఖలాలు.
ఎన్నాళ్ళని ఒంటరి ప్రయాణాలు?
ఎడతెగని పోరాటాలు?
వొరలోనూ ఒదగడానికిష్టపడని
వైయక్తికమైన
ద్వేష వైషమ్యాల చురకత్తులు?

*****************************

No comments:

Post a Comment