భజరే మానస గోపాలం------?
====================
మల్లెపూవులాంటి ఆకాశం మీద
ఈ తుడుపుకు వీలుకాని మరకలేమిటి?
అసురసంధ్య సమీపించకముందే
వర్ణ శోభితం కాలేని నీ వదనం పైన
రచితమైన ఈచిత్ర విచిత్రమైన
రంగుల అద్దకాలేమిటి?
ఉదయాన్నే ప్రశాంతంగా ఆఫీసుకెళ్ళినవాడు
సాయత్రం తిరిగొచ్చేసరికి వినిపించే
ఈ ధుమ ధుమల మాటేమిటి?
కారణాలు వెదకడంలోనే కాలం
ఖర్చయిపోతుంటే జమచేయగల
అనుభూతుల ఖజానాలో పడని పద్దుల మాటేమిటి?
సుద్దులు చెప్పడంతోనే సుప్రభాత శ్లోకాలు మొదలవుతుంటే
పొగలు గక్కుతూ సువాసనలు వెదజల్లే పింగాణీ కాఫీ కప్పుకు
ససేమిరా పొసగనటువంటి ఈ బుంగమూతి వంకర టింకరలెందుకు?
పవళింపు సేవగదాని ప్రత్యేకంగా ఎంచుకుని కట్టుకున్న
కాటీడుకోకకు సంవత్సరం పాటే మనవలసిందన్న
నిబంధనను ఆచరణలో గౌరవించి మన్నించేఅవకాశమెప్పుడు?
No comments:
Post a Comment