దిదృక్ష
వేలపూల దారుల్లో నీ ఆరామం వెదుక్కోవడం సులువయిందిగానీ
అక్కడ తొడతొక్కిడిగా జనం ఎన్నెన్నో వరుసల్లో
నిలబడి నీ సాక్షాత్కారంకోసం
చకోరపక్షుల్లా నిరీక్షిస్తున్నారు ప్రభూ!!!
నీదివ్యదర్శనానికి యేండ్లు పూండ్లు పట్టేలా వున్నది స్వామీ !!
వేచి వుండనా! విసిగి వేసారి
నాగుండెగొంతుకలోంచి ఓ పొల్లు మాట దొర్లి రాకముందే
ఇక్కడనుంచి తక్షణమే చిత్తగించి, మరో సారి నా
అదృష్టాన్ని పరీక్షించుకు నే ప్రయత్నం చేయనా !
నువ్వే తేల్చి చెప్పగలిగితే నా మనసు కుదు ట పడుతుంది.
మీదుమిక్కిలి ఆ పాపం పుణ్యం నామీద
పడకుండా కాపాడినపుణ్యమూర్తివీ అవుతావు స్వామీ!!!
ఈ భీరువుని మనసారా మన్నించు.!! మరో చిరు ప్రయత్నానికి నన్ను సమాయత్తం కానివ్వు.
నాహృదయ మందిరాన అధివసించే అఖిలాండ
బ్రహ్మాండ నాయకా. సెలవా మరి!!!
--------------------------------------------------------------------------------------------------------
దయామయా!!!
అంతరాంతరాళాల్లో అంధకారం
అనుస్యూతంగా విస్తరించిపోగా
ఒక వెలుగు రేకకోసం తపన పడుతూ
నా హృదయం, మీదుమిక్కిలి నా మానసం
పధగాములై రేయనకా పగలనకా
ఆమడలదూరం పాదయాత్రనుజేసి
ఆకాశహర్మ్యంలా నిర్మితమైన నీ నివాసగృహానికి
భక్త కల్హారం లా విచ్చేసాను ప్రభూ!
నీమునివాకిటిముందు మూర్ధన్యుడనై
నీ మూర్తిమంతమైన రూప దర్శనంకోసం
చకోరంలా పడిగాపులు కాస్తున్నాను ప్రభూ!
ముందస్తుగా నీకెలాంటి వినతిపత్రాన్ని సమర్పించుకోని
నా అసమర్ధతను మనసారామన్నించు, మహాప్రభూ
అమందానందకందళితమౌ నీ సుందర హృదయారవిందాన్ని
నిర్మల భాసితమౌ సర్వమంగళకరమౌ, నీ నిజరూపాన్ని
నా నేత్రాలతో సందర్శించుకునే
మహాభాగ్యాన్ని
నీరనిస్థబ్ధయౌ నా నిబిడాంధకారం
లిప్తమాత్రలో
పటాపంచలై దిగంతాలదరికి పలాయనం చిత్త
గించేలా
మన్నించి ఒక చిరు వరాన్ని ప్రసాదించు దయామయా!!!
No comments:
Post a Comment