Monday, August 3, 2015

సదసత్సంశయం .
మంచితనానికీ
మానవత్వానికీ
ముఖచిత్రంలా నిలిచిందాతరం
సంస్కృతీ సంప్రదాయాలను
సమున్నత శిఖరాలపై నిలిపిందాతరం
ఇప్పుడా తరం తీరు మారిపోయింది
కొత్త తరం ఊపిరులూదుకున్నది
కశ్మలాల కల్మషాల కార్య ష్థా నమై
కృశించిపోతున్నదీ తరం

మానవత్వపు మూలాలను విస్మరించి
మృగాల్లా ప్రవర్తిస్తూ ధరా భారమై
మానినీ మనభంగాలహోరుతో
   నవదనులుగా శిక్షార్హమై నిలిచిందీతరం.

పల్లెతల్లి నులి వెచ్చని వొడిలో
ప్రశమించిన వాత్సల్యాన్ని
పుణికిపుచ్చుకున్నదాతరం
పట్టణ జీవన సమరంలో
రణగొణధ్వనులమధ్య
భీతావహమై బిక్కుబిక్కుమంటూ
భిక్షువలా మిగిలిందీతరం


మౌనరాగాలనూ ద్వేష భావాలనూ
మునివాకిటనిలుపుకుని
ప్రేమంటే స్వార్ధమేననీ
ప్రణయాన్ని కాదంటే
ప్రళయావిర్భావమే హేతువంటూ
తలవంపులు తెచ్చుకున్న తరంతో
తరుముకుంటూ వస్తున్న దఃఖాన్ని
వెలుగుల వలయాలనన్నింటినీ

 చీకటి తెరలతో
కప్పి విస్తరింపజేస్తూ వెలవెలబోతున్న తరంతో
మనిషితనం మరుగునపడి
చిద్రమై పోతున్నదేమోననని
నా సదసత్సంశయం .
------------------------
తస్మాత్  జాగ్రత్త
-----------------------
 అరిచే కుక్కలు కరవవు
కరిచే సృగాలాలు అరవవు
అరవని కరవని శునకాలు
ఎక్కదా దొరకవు
క్షమించండి !! 
ఇది నిన్నటి శ్రీ శ్రీ బోధించిన
 నిజం
నేడు సీనంతా తారుమారయింది
ఇప్పుడు  ప్రభుత్వ కార్యాలయాల్లో అంతటా
ఎంతబడితే అంత 
ఎక్కడ పడితే అక్కడ మేసే
కుక్కల హడావిడే
నేతల ప్రసంగాల సభల్లో
చప్పట్లు కొట్టే అద్దెకొచ్చిన కుక్కలు
సరిపడని వాడి సభలో వేడిగా నినాదాలతో
రాళ్ళు చెప్పులు వాటంగా విసిరేసే
అలజడి సృష్టించే ఆందోళనల సృగాలాలు
ఎక్కడబడితే అక్కడ
యేదిబడితే అది తినేసే ,వీధికుక్కలు
నిత్యజీవితంలో దర్శనమిస్తాయి
అరిచినా కరవకపోయినా
అన్నిరంగాలను ఆక్రమించేసి
అసహ్యాన్ని కలిగిస్తున్నాయి
నవ్వుకూడా ఇప్పుడు
కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి
జారి పోయే వీలు కలుగుతుంది
ఆక్సిజన్ ,లాబరేటరీల్లాగా
నవ్వుల క్లినిక్ లు నగరాలంతటా
విస్తరింపజేసే ప్రణాళికలొస్తాయేమో
వేచిచూడండి
ప్రపంచ బ్యాంకు నిధులురానే
వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా
విధులు , ,నియమాలను రూపొందిస్తారు కాచుకోండి
నవ్వడం ఇక భాగ్యవంతులకే
పరిమితమయే వీలుకలుగుతుంది
తస్మాత్  జాగ్రత్త

బ్రహ్మాస్త్రాన్ని-----
మనసు పిచ్చుక లాంటిది
ఎక్కడెక్కడనుంచో గడ్డిపరకలు యేరుకుని తెచ్చి 
గవాక్షాల దగ్గరగా గూడును కట్టుకుని
గొప్పదనాన్నయానని భుజాలు 
చరుచుకుని తృప్తిపడుతుంది .
అద్దంకనబడగానే ఆ అల్పప్రాణి
రకరకాలుగా సోయగాలుపోతూ
రాజసాన్ని ఒలకబోస్తుంది .

మనిషీ అంతేకదా 
రకరకాల అనుపానాల్లోంచి 
రాణకెక్కిన భాషణలను
మహానుభావుల సుభాషితాలనూ 
వల్లె వేసుకుంటూ జీవితమార్గాన్ని 
ఆదర్శవంతంగా అనుసరణీయంగా 
మలచుకుంటూ మనుగడ సాగి స్తూంటుంది.
అద్దమంటూ కనబడగానే 
ఆనందపరవశయై 
బాల్య స్మృతులనూ 
యవ్వనపు మధురిమలనూ 
నడివయసులో పొటమరించే 
నాజూకుదనాలనూ
అక్షరాల గవాక్షాలలో
నిక్షిప్తం జేస్తూ
 మురిసి ముక్కలయిపోతాడు 
అయితే చిక్కొచ్చి పడిందల్లా 
మనిషీ మరోమనిషి తారసపడగానే
తన కష్టాలనన్నింటినీ కదంబంలా గుచ్చి 
యేమనిషయితే మహోజ్వలంగా వెలిగిపోవాలో 
ఒక బక్క ప్రాణిపై అదేమనిషి
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న దిశలో 
కర్తవ్యతామూఢుదై కుత్సితమనస్తత్వంతో
కునారిల్లుతూ ఘూర్ణిల్లితూపోతే
ప్రయోజనం యేముంటుంది?
తిమిరమా దరిచేరకు
***************
ఎందుకనో చీకటి
యిలా విస్తరిస్తూ పోతున్నది
వెలుగు వెన్నెల ద్వారాలను
మూసుకుంటూ పోతున్నది.

చీకటిలో మెరిసి పోయేవి
చైతన్యం కోల్పోయిన
కుత్సిత మైన మనస్సులు
అంధకారం లో మురుస్తూ
ఆర్తనాదాలు చేసే కుతంత్రాలున్నూ .
అలాగని చీకటిని అనవరతం
ద్వేషించినంతమాత్రాన సరిపోదు
వెలుగుదివ్వెల కాంతులకోసం
విరామమెరుగని శ్రమ తప్పదు .

అవినీతితో సహా అన్ని చీకటి కోణాలతో
అంకితమైన జనావళి
వెలుగురేకలకోసం అవిశ్రాంతంగా
జాగృతమవడమే దీపావళి .
తిమిరం ఇనుపతెరలు
ఆమూలాగ్రంగా చేధిస్తేనేగాని
వెలుగు వెల్లువై ప్రవహించే
వెసులుబాటు కనిపించదు
అందుకనే మనిషిలోని
రాక్షసాంశ
అంతమయే రోజు సమీపిస్తేనేగానీ
అన్ని ప్రాణులలోని దైవాంశ
బహిర్గతమయే వీలుకలుగదు .
తిమిరమా దరిచేరకు
వెలుగుకెప్పుడూ వీడ్కోలంటూ పలుకకు
జనావళి హృదయసీమల్లో
దీప కాంతులకు సుస్వాగతం పలుకు
-------------------------------

No comments:

Post a Comment