Tuesday, June 30, 2015

జీవన యానం
============
బాల్యమంతా
 కోతికొమ్ముచ్చులాటలతో
బరితెగించి ఆడే
  బచ్చాలాటలతో
తొడతొక్కిడిగా ఆడే
తొక్కుడు బిళ్ళాటలతో
ఒంగుదూకుళ్ళనే
 వొంటిని కష్టపెట్టే,  క్రీడలతో
అమ్మ ఆసరా చుసుకుని
 అన్నీ  అవిఘ్నంగా కొనసాగాయి .

యవ్వనంలోకి అడుగిడగానే
కళాశాలల మీద  నాకళ్ళు పడి
కొత్త పరిచయాల కొంగ్రొత్త రుచులు
ఆరాధనా భావాల అంతరంగాలు
మానసికంగా మధనపడే
మహోదధిలో,  తేలియాడే
ఆవేదనా కెరటాలతో  అస్తవ్యస్తమై
నా ఆలోచనా పరిధులను
 అనూహ్యంగా విస్తరింపజేసాయి

ఉద్యోగపర్వంలోకి రాగానే
ప్రియభామిని అందించిన
నందనవనంలోని
పూలమొక్కలు, సురభిళ పరిమళంగా
విస్తరించి కుటుంబ వృక్షాన్ని
విశిష్టమైన చివురాకుల
 సంతకాలతో నింపాయి .

ఇప్పుడు విరామపర్వంలోకి
 వడి వడిగా అడుగులు వేసే వీలయింది.
పునరాలోచనల పున్నాగపూలు
 గుబాళిస్తున్నాయి
పొగడ్తల పొగడండలు తలను వంచేస్తున్నాయి
మధ్యమధ్యలో
నిరాశానిస్పృహల స్నేహహస్తాలు .
ఒంటరితనపు చీకట్లను
ఒక్కొక్కటిగా ఉన్మీలనంచేసుకుంటూ
భయంగుప్పిట్లోంచి బయటపడే
 మార్గంకోసం వెదుకుతూ
చివరంతా తోడొస్తానన్న
నాతో యేడడుగులు వేసిన మనిషి
 మధ్యేమార్గంలో
దివికేగి నన్ను దిగాలు సంద్రంలోకి
జావిడిచినప్పుడు స్నేహహస్తం సాచి
గుండెకు ఆప్యాయంగా హత్తుకున్న
పుస్తకాల దొంతర్లమధ్య
జీవనయానం సాగించే
అదృష్ట హీనుడినైనాసరే
  ఒంటరితనపు చీకట్లను
ఒక్కొక్కటిగా ఉన్మీలనంచేసుకుంటూ
భయంగుప్పిట్లోంచి బయటపడే
 మార్గంకోసం వెదుకుతూ
తన  ఊపిరినికూడా నేనేనని భావిస్తూ
 జీవనయానం సాగిస్తున్నాను.
----------------

No comments:

Post a Comment