Sunday, June 28, 2015

ఎదురుచూపు .
-------------------
అందరూ జాలితో నావైపు
చూపు మరల్చకుండా చూస్తున్నారు.
బాధలున్నాయ్
సంతోషాలున్నయ్
సంతాపాలున్నాయ్.
ప్రతిప్రాణీ భరించలేనంత
ప్రశ్నల ములుకులు
ప్రతినిత్యమూ గుచ్చుకుంటూనే వున్నాయ్
ఐనా ఆశలచివుళ్ళు
నన్ను చిరునవ్వుతో హృదయపూర్వకంగా
తమచెంతకు, శీఘ్రమే రావలసిందిగా
ఆహ్వానిస్తూనే వున్నాయ్.
సంధ్యాసమయాల్లో
ఉవ్వెత్తున యెగసిపడే
సందేహాలకు సమాధానాలను
వెదుక్కునే పని
నాకు కల్పించకుండా
అసంకల్పితంగా మెదడు
తగిన సహకారమందిస్తూనే వుంది.
జననమరణాలమధ్య
ఆధ్యాత్మికత అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ
తగురీతిలో సమయానుకూలంగా
సందేశాలనందిస్తూనేవుంది.
చిక్కు వచ్చిపడిందల్లా
చిక్కనయిపోతున్న నా భావోద్వేగాన్ని
సరిదిద్ది చక్కనయిన మార్గంలో నడిపించగల
ధీశాలికోసమే నా ఎదురుచూపు .

No comments:

Post a Comment