Friday, June 19, 2015

చీకటి ప్రస్థానం----
--------------------

చీకటి ప్రస్థానం బహు చిత్రంగా వుంటుంది.
ఒక్కోసారి పలుచటి దుప్పటిలా పరుచుకు పోతూ
పారదర్శకమై నిలుస్తుంది.
అన్ని అధర్మ కార్యాలకూ ఆలవాలమై
చేదోడు వాదోడుగా ప్రవర్తిస్తుంది.

పట్టుకుని కట్టి కుదేసేదాకా
పరుగులు పెడుతూ
 చిక్కకుండా చిరాకు పెడుతుంది.
 మరింకోసారి కొంత గాఢంగామారి
కౄరాతి క్రూరంగా కార్యాలను నిర్వర్తిస్తుంది.
దళసరి గొంగళిగా మారి
దారంతటా విశాలంగా విస్తరిస్తుంది.
కన్నుపొడుచుకున్నా కానరాని
గాఢాంధకారాన్ని ద్యోతకం చేస్తూ
విషపు నవ్వులను విరివిగా పంచుతుంది.

చీకటి విన్యాసాలు బహు  చిత్రంగా కనుపిస్తాయి.
వెలుగును కబళించడానికి వేదికను నిర్మిస్తుంది.
వెన్నెలను నేలకు దిగిరాకుండా
వేనవేలు ఉపాయాలతో శాయశక్తులా నిరోధిస్తుంది.


ఐనా నిజ జీవితగమనంలో చీకటిని కౌగలించుకుని
నల్ల కుబేరులై పోవాలని భావించే అధమాధములెందరో
సాముగరిడీలుచేస్తూ కుస్తీలు పట్టడం ఎన్నెన్ని చూడడంలేదు మనం?.
వారికి వెలుగు ద్వారాల వెంట రాజసంగా నడుస్తూ 
ధర్మానికి దాసులుగా దయా దాక్షిణ్యాలతో
హృదయకోశాలను కృపతో నింపుకునే ధ్యాసా, తీరికా వుండవు.
నిత్యం ఎక్కడ దొరికిపోతామోననే భయాందోళనలే
వారికి ఉచ్చ్వాస నిశ్వ్వాసాలు గా నిలబడి
నిలువునా వేధిస్తూ వెన్నంటి కృశింపజేస్తాయి.

No comments:

Post a Comment