Friday, July 31, 2015

అన్వేషణ
---------------------
అందరూ జాలితో నావైపు
చూపు మరల్చకుండా చూస్తున్నారు

బాధలున్నాయ్
సంతోషాలున్నాయ్
సంతాపాలూ ఉన్నాయ్
ప్రతిప్రాణీ భరించలేనంతగా
ప్రశ్నలములుకులు పెనవేసుకుని
ప్రతినిత్యం శూలాల్లా గుచ్చుకుంటూనే వున్నాయ్.

ఐనా ఆశల చివుళ్ళు అనవరతం
ఆహ్వానాలనందిస్తూనేవున్నాయ్.

సంధ్యాసమయాల్లో
ఉవ్వెత్తున ఎగసిపడే  సందేహాలకు
సమాధానాలు చిక్కకుండా పరుగెడుతూనే వున్నాయ్.

జనన మరణాలమధ్యన ఆధ్యాత్మికతను
అందిపుచ్చుకునే అవకాశాన్ని మెదడు అందిస్తూనే వున్నది.

చిక్కు వచ్చిపడిందల్లా చిక్కి శల్యమౌతున్న మనోధైర్యాన్ని
చిక్కులపాలిట బడి క్రుంగి కృశించకుండా
దగ్గరుండి నడిపించగల ధీరోదాత్తుడయిన
స్నేహశీలికోసమే ఈ నా నిరంతరాన్వేషణ.
====================================

No comments:

Post a Comment