Wednesday, July 1, 2015

త్వదీయం
------------------
ఆమె ఓ మహిమాలయం
నిరాశా నిస్పృహలతో
నీరుగారిపోతూన్న నన్ను
అధిక శ్రమకోర్చి ఘనీభవింపజేస్తుంది.
నీరవ నిశ్శబ్దపు స్తబ్ధతలోంచి
బయటపడటానికి
సులుసూత్రంగా సాయమందిస్తుంది.


ఆమె ఓ వెలుగు కిరణం
వెల్లువగా ప్రవహించే
తిమిర మహోదధులను
తిన్నగా నాగదిలోకి చొరబడి
నన్ను చిరాకు పెట్టకుండా
దారిమళ్ళించడానికి
శతవిధాలుగా సాయమందిస్తుంది.
స్నేహ హస్తాన్ని సాచి భానుడిలా
సర్వం సహా ఆదుకుంటుంది.

ఆమె ఆధునికతనలముకొన్న
అద్భుతమైన రంగు రంగుల
గోడకలంకారమైన వర్ణచిత్రం.
రమణీయ రిరంసను నా హృదయకవాటాల్లోకి
అంతర్వాహినిగా అనుస్యూతంగా  ప్రవహింపజేస్తుంది.

ఆమె ఒక పద్య కవిత
యతిప్రాసల నియమ నిబద్ధతకు
నిఘంట్వర్ధంగా నిలిచి
విస్మృత చరణస్ఫురణకు
అందివచ్చేలా అందమైన
 గణబద్ధమైన సోదాహరణం.
మాటలకందని మధుర భావాలను
రాగరంజితం చేసే దిశగా స్వేదం వెలార్చే
నిత్య సంతోషిణి
నిర్మల మందాకినీ వీచిక

No comments:

Post a Comment