Monday, July 13, 2015

నాలుగు దశలల్లో--
--------------------రావెల
==========================

శైశవావస్థలో
అమ్మను ప్రేమించాను.
స్తన్యాన్నందించి

నాకు జీవధారలను
అందించినందుకు కాదు.
నా అల్లరి చిల్లరచేష్టలనన్నింటినీ
అభిమాన పురస్సరంగా భరించినందుకు.

యవ్వనదశలో
సౌందర్యలలామలనందరికీ
తలను వంచి గౌరవించాను.
నా సహధర్మ చారిణిలోని
సహన శీలాన్ని మనోపధంలో
శాశ్వతంగా నిలిచిపోయేలా
నిరంతరంగా  కృషి చేసినందుకు.


నడివయసులో ఉద్యోగపర్వంలో
ఉన్నతాధికారులను గౌరవించాను.
కారణం నగరాల్లో నన్ను నియమించి
ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేయకుండా
పల్లె సీమల్లోని సౌమనస్యాన్నె
పంచుకునే అవకాశాన్ని అందించగలిగినందుకు.

ఇప్పుడు ఈ మలిసంధ్య వేళ
అందరూ నన్ను అభిమాన పాశంతో బంధించేసారు.
ప్రకాశవంతంగా గడచిన గతాన్ని
గుర్తు చేసుకుంటూ నడుంవంచి నడుస్తున్న నన్ను
నర్మ గర్భంగానైనా ఆశీస్సులనందించాలని
తపనబడుతూ నన్ను తమలో ఒకడిగా గౌరవిస్తున్న
సాహితీ సుగతులందరికీ ప్రణమిల్లడం కనీస ధర్మంగదా! .

No comments:

Post a Comment