Wednesday, July 29, 2015

నగరక్షోభ
===============రావెల.
--------------------------

నగరం నాకెప్పుడూ
నల్లజీరల సంద్రంలా
గోచరిస్తుంది.
కలవాడి కొలతల వాడితో
కలలుగనే వాడి కలతల వేడితో.

ఆటొల్లో బాల్యం క్రిక్కిరిసి వ్రేలాడుతుంది.
సిటీ బస్సుల్లో ఫుట్ బోర్డ్లపైన
ప్రయాణించే ఆకతాయి యువత చేష్టలతో
కళాశాలల ఆడ్తతనం  సిగ్గుతో తలదించుకుంటున్నది.
రేపటిఉషోదయం చూడగలనో లేనో అనే సంశయంతో
వృద్ధాప్యం వెతలబారినపడి రోగగ్రస్తమౌతున్నది.

ఇప్పుడు హోండానా మారుతీ జెన్నునా, వెర్సానా, స్కోడా కారునా
దేనినికొనాలో తేల్చుకోలేక తిక్కిరిబిక్కిరి ఔతున్నది
సాఫ్ట్వేర్ దాంపత్యం.

బంజారాహిల్స్లోనా జూబిలీలోనా ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలో
తెలీక అవినీతి ఉద్యోగం ఆతృతగా ఎదురుచూస్తున్నది.
మురికివాడల అభివృద్ధి పేరిట కేటాయించబడిన కేంద్రనిధులనెలా
స్వాహాచెయ్యాలో రాజకీయంప్రణాళికలను
 రచించడంలో పూర్తిగా అంకితమౌతున్నది.

కాలుష్యాల కలశపాధోరాశిగా మహానగరం
వేయిపడగలెత్తి మోరజూపి ఆరోగ్యాన్ని
హరీమనిపించడంలో కృతకృత్యమౌతున్నది.

కార్పొరేట్ ప్రజాస్వామ్యం సోషలిజం సూర్యుడిని
ఆసాంతం మింగాలని తగుసహాయాన్నందించమని ప్రభుత్వానికి
వినతిపత్రం సమర్పించి చోద్యం చూస్తున్నది.

-----------------------------------------------------------------------28-7-15

No comments:

Post a Comment