జీవన యానం
బాల్యమంతా
కోతికొమ్ముచ్చులాటలతో
బరితెగించి ఆడే
బచ్చాలాటలతో
తొడతొక్కిడిగా ఆడే
తొక్కుడు బిళ్ళాటలతో
ఒంగుదూకుళ్ళనే
వొంటిని కష్టపెట్టే, క్రీడలతో
అమ్మ ఆసరా చుసుకుని
అన్నీ
అవిఘ్నంగా కొనసాగాయి .
యవ్వనంలోకి అడుగిడగానే
కళాశాలల మీద నాకళ్ళు పడి
కొత్త పరిచయాల కొంగ్రొత్త రుచులు
ఆరాధనా భావాల అంతరంగాలు
మానసికంగా మధనపడే
మహోదధిలో,
తేలియాడే
ఆవేదనా కెరటాలతో
అస్తవ్యస్తమై
నా ఆలోచనా పరిధులను
అనూహ్యంగా విస్తరింపజేసాయి
ఉద్యోగపర్వంలోకి రాగానే
ప్రియభామిని అందించిన
నందనవనంలోని
పూలమొక్కలు, సురభిళ పరిమళంగా
విస్తరించి కుటుంబ వృక్షాన్ని
విశిష్టమైన చివురాకుల
సంతకాలతో నింపాయి .
ఇప్పుడు విరామపర్వంలోకి
వడి వడిగా అడుగులు వేసే వీలయింది.
పునరాలోచనల పున్నాగపూలు
గుబాళిస్తున్నాయి
పొగడ్తల పొగడండలు తలను వంచేస్తున్నాయి
మధ్యమధ్యలో
నిరాశానిస్పృహల స్నేహహస్తాలు .
అప్పుడప్పుడూ
ఆనందసంధాయకంలా
రంగు రంగుల
రంగవల్లుల్లా
మనుమలూ మనవరాండ్రూ
అంతరంగాన్ని, కాంతిపుంజాల
సంక్రాంతిలా వెలుగులో ముంచేసి
క్రాంతిమయం గావిస్తూ
ఈ అనుభూతుల
అంతరంగ కధనాలు
ఈ వసంతయామినిలో
వెన్నెల పులుగులై సాక్షాత్కరిస్తూ
మధుర గీతలను మనోహరంగా గానంజేస్తూ
కమ్మని గాత్ర సౌలభ్యంగల కోయిలల్లా
నా జీవన సంగీతాన్ని సప్తస్వరరస ధునిగా
సంతసానంద సాగర సంభరితంగా తీర్చి దిద్దుతూ
నన్ను పుణ్య చరితుణ్ణి గావిస్తున్నాయి
----------------
No comments:
Post a Comment